" మమ్మల్ని మేమే ఉద్ధరించుకున్నాం "

 

 

నా పేరు "కొములమ్మ". మాది ఏజన్సీ గిరిజన ప్రాంతానికి చెందిన "పెట్టుగోడల" గ్రామం. నా చిన్నతనం నుంచీ మా కుటుంబం అంతా "భీమ్‌సింగి" గ్రామంలో ఉండే "శ్రీ పాకలపాటి గురువు (బాబుగారు)" దగ్గర సన్నిహితంగా మెలుగుతూ వారిపట్ల ఎంతో భక్తిని కలిగి ఉండేవాళ్ళం. తరచూ వారి ఆశ్రమంలోనే కాలం గడుపుతూ బాబుగారి సందేశాలు వింటూ త్రాగుడు, మాంసాహారం మానివేశాం.

 

ఈ క్రమంలో ఒకరోజు బాబుగారు మా అందరితో ముచ్చటిస్తూ .. "కొంతకాలం తరువాత ఇద్దరు మహిళలు వచ్చి ధ్యానం నేర్పి, మీకు మంచి భోజనం పెట్టి మిమ్మల్ని జ్ఞానవంతులుగా చేస్తారు" అని చెప్పారు.

 

2002 సంవత్సరంలో బాబుగారు సమాధి చెందాక మేము ఇక ఆశ్రమానికి వెళ్ళలేదు. మెల్లిమెల్లిగా మా జీవితాల్లో కష్టాలు మొదలై ఒక పూట తింటే ఇంకో పూట పస్తు ఉండేలా బాధలు అనుభవించాం! ఆ పరిస్థితులలో 2007 సంవత్సరం దీపావళి రోజు బాబుగారి ఆశ్రమానికి వెళ్ళి బాబుగారి సమాధి గదిలో కూర్చుని వారిని తలచుకుని బాధపడుతున్నాము. అప్పటికే కొంతకాలంగా బాబుగారి ఆశ్రమంలో ధ్యానశిక్షణను అందిస్తూన్న భీమ్‌సింగి పిరమిడ్ మాస్టర్స్ .. "దేవి", "రజిత" మేడమ్‌లు మాకు భోజనం పెట్టించి .. ధ్యానం నేర్పించారు.

 

లోగడ బాబుగారు చెప్పిన మాటలు గుర్తువచ్చి .. ఆ ఇద్దరు పిరమిడ్ మాస్టర్ల రాక బాబుగారి సందేశంగా తలచి .. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టాం. మా గ్రామ పెద్దలతో మాట్లాడి గ్రామంలో ఉన్న 30 గిరిజన కుటుంబాల వారికి ధ్యాన - శాకాహార ప్రచారాలను నిర్వహించాం. వాళ్ళందరూ మద్యం, మాంసాహారం మానివేసి ఇప్పుడు అనారోగ్యాలకు దూరంగా జీవిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ITDA ద్వారా గిరిజనుల కోసం "పౌష్టికాహార పథకం"లో భాగంగా అందిస్తూన్న కోడిగ్రుడ్లను నిరాకరిస్తూ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు విన్నవించుకుని దానికి బదులుగా మేమంతా ఇతర పప్పు ధాన్యాలను పొందుతున్నాం.

 

ఇలా ఉండగా ఒక రోజు గ్రామంలో నిర్వహించిన పౌర్ణమి ధ్యానంలో నాకు బాబుగారు తెల్లని వస్త్రాలతో ఒక ఏనుగు అంబారీ మీద కూర్చుని తమ చేత్తో గ్రామస్థులందరికీ ప్రసాదం పంచుతూ కనిపించారు. ఆనాటి నుంచి మా గ్రామస్థులందరికీ ఏనాడూ తిండికి ఇబ్బంది లేకుండాపోయింది. ఈ క్రమంలో మేము 2011 సంవత్సరంలో విశాఖపట్టణంలో జరిగిన "ధ్యానమహాచక్రం-II" సంబరాలకు వెళ్ళి అక్కడ ధ్యానం చేసి అద్భుతమైన అనుభవాలను పొందాం. అక్కడి నుంచి వచ్చాక మా గ్రామస్థులు అంతా కలిసి గ్రామంలో మూడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 40'X40' "బ్రహ్మర్షి పత్రీజీ ధ్యాన పిరమిడ్"ను నిర్మించుకుని .. 2012, జూన్ 10 వ తేదీన స్వయాన పత్రీజీ చేతుల మీదుగా దానిని ప్రారంభోత్సవం చేయించుకున్నాం!

 

చుట్టుప్రక్కల గిరిజన గ్రామాల్లో ఉన్న మా స్నేహితులకూ, చుట్టాలకూ ధ్యాన-శాకాహార ప్రచారాలు చేసుకుంటూ అద్భుతమైన శక్తి తరంగాలతో నిండి ఉన్న మా ధ్యాన పిరమిడ్‌లో ధ్యానం చేస్తూన్నాం. ధ్యానంలో బాబుగారితో కలిసి సత్యలోకం, బ్రహ్మలోకం, పరబ్రహ్మలోకం వంటి అనేకానేక ఇతర విశ్వలోకాల్లో సూక్ష్మశరీరయానాలు చేస్తున్నాం.

 

ఇన్నాళ్ళుగా నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండి మంచీ-చెడుల మధ్య తారతమ్యాలను మరచి బ్రతుకుతూన్న మాకు .. ధ్యానశక్తి గురించి తెలియజేసి సరియైన శాకాహార జీవన విధానాన్ని రుచి చూపించిన రజిత, దేవి మేడమ్‌లకూ మరి చల్లని గురువు పత్రీజీకీ దండాలు తెలియజేసుకుంటున్నాం!

 

 

 

గెమ్మెలి కొములమ్మ

పెట్టుగోడల గ్రామం
విశాఖపట్టణం జిల్లా

Go to top