" అంతరాత్మ సందేశంతోనే పిరమిడ్‌ల నిర్మాణం "

 

 

నా పేరు "చంద్రకాంత రాజు" నేను "విజయవాడ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్"లో ఇంజనీయర్‌గా పనిచేస్తున్నాను. 2002 సంవత్సరం విజయవాడలో జరిగిన ధ్యానమహాయజ్ఞానికి నా స్నేహితుడు "వేంకటేశ్వర్లు" గారు తీసుకు వెళ్ళడంతో మాకు ధ్యాన పరిచయం జరిగింది.

 

అప్పటికే మేము "మంతెన సత్యనారాయణరాజు"గారి ప్రభావంతో శాకాహారులుగా మారినా ఆధ్యాత్మిక పురోగతికి శాకాహార అవసరాన్ని మాత్రం పత్రీజీ ద్వారానే తెలుసుకున్నాం. మా నాన్నగారు ఆధ్యాత్మిక తృష్ణ కలవారు కావడంతో మేమంతా ఆ కార్యక్రమానికి వెళ్ళి "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్" 18 ఆదర్శ సూత్రాలను తెలుసుకుని పత్రీజీ పట్ల ఆకర్షితులమయ్యాం.

 

కానీ ధ్యానసాధన, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో సంపూర్ణ భాగస్వామ్యం మాత్రం 2005లో భీమవరంలో ప్రతినెలా మూడురోజుల పాటు జరిగే ధ్యానశిక్షణా కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత మాత్రమే ప్రారంభమయ్యింది. ఎంతొ తేలికగా ఆచరించగలిగే "ఆనాపానసతి" ధ్యాన విశిష్ఠత, భూమిపై పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ప్రముఖ పాత్ర అన్న ఆ శిక్షణలోనే నాకు సంపూర్ణంగా విశదమయ్యాయి.

 

2006లో "పిరమిడ్ జగత్" కార్యక్రమం విజయవాడలో జరిగింది. దానిలో పత్రీజీ వేణునాదంతో ధ్యానం చేస్తూండగా నా లోపలినుండి చాలా స్పష్టంగా "పిరమిడ్ నిర్మించు" అన్న సందేశం వినపడింది. అప్పుడు ఒక నెల లోపునే మా స్వంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా, "కామవరపు కోట"లోనూ ఇంటిపై జంట పిరమిడ్‌లు నిర్మించి పత్రీజీచే ప్రాణప్రతిష్ఠ జరుపబడింది.

 

తరువాత క్రమక్రమంగా పిరమిడ్ నిర్మాణాలపట్ల ఆసక్తి కలిగి ఆ రంగంలో పనిచేస్తున్న ఖమ్మం పిరమిడ్ రామారావుగారు, వైజాగ్ "కిషోర్"గారు పరిచయమయ్యారు. ముగ్గురం కలిసి 2010 వరకు సుమారు 500 పిరమిడ్‌ల నిర్మాణంలో పాలుపంచుకున్నాము!

 

పత్రీజీ ఆదేశాల మేరకు వారిద్దరూ ఇప్పుడు ఉత్తరభారతదేశ రాష్ట్రాలలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కార్యక్రమాలు చూస్తున్నారు. అప్పట్లో ధ్యానులను ప్రోత్సహించి పిరమిడ్‌లను నిర్మించేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ధ్యానులే ముందుకు వచ్చి పిరమిడ్‌లు నిర్మించమని కోరుతున్నారు! ఇది ఎంతో గొప్ప పరిణామం! అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పిరమిడ్‌ల నిర్మాణం మా లక్ష్యం. అందులో భాగంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న సెంట్రింగ్ చెక్క అవసరం లేకుండా .. సిమెంట్ మెత్తే విధానం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన నిర్మాణాలు చేస్తున్నాం.

 

పిరమిడ్ మూడు రకాలుగా ఉంటాయి. "రూఫ్ టాప్ పిరమిడ్" అంటే ఇంటి స్లాబ్‌పైన కట్టేది; "గ్రౌండ్ పిరమిడ్" .. భూమి మీద కట్టేది; "పిరమిడ్ హౌస్" .. ఇంటిపై స్లాబ్ పూర్తిగా పిరమిడ్ ఆకారంలో నిర్మించుకునేది. పిరమిడ్ వల్ల కొన్ని ప్రయోజనాలను చెప్పుకుందాం:

 

* వ్యవసాయం రంగంలో విత్తనశుద్ధికి మరి పొలంలో పిరమిడ్‌లు వుంచడం వల్ల చీడ, పీడల బారినుండి రక్షించబడి ఎక్కువ మరి నాణ్యమైన ఫలసాయం పొందగలం.
* రోడ్డు ప్రమాదాల నివారణలో తోడ్పడతాయి. నాగపూర్ హైవే ప్రక్కన 2'X2' పిరమిడ్‌లు వుంచటం ద్వారా ప్రమాదాలు ఆరికట్టబడ్డాయి.
* విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగు అవుతాయి.
* పాక్షికంగా దెబ్బతిన్న ఓజోన్‌పొర పూర్వపు స్థితికి చేరుతుంది.
* ఆధ్యాత్మిక సాధనలో పురోగమనం అత్యంత వేగంగా జరుగుతుంది.

 

ఇక పిరమిడ్ నిర్మాణం అంటే అది మామూలుగా భవన నిర్మాణం వంటిది కానేకాదు. అది ఒక తల్లి ప్రసవ వేదన వంటిది. శక్తిక్షేత్రం అయిన ప్రతి పిరమిడ్ పూర్తయిన తర్వాత శిశుజననం. తర్వాత తల్లి పొందే ఆనందాన్ని పొందుతాము. పిరమిడ్ నిర్మాణ ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు ప్రతి అడుగు మాకు ఎంతో శక్తినీ మరి ఆనందాన్నీ ఇస్తుంది.

 

ఇంకా పిరమిడ్ నిర్మాణాల వలన 2006 నుంచీ ఇప్పటి వరకు అనేక మంది ఆప్తులను పొంది వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రకాశం జిల్లా .. "మార్టూరు పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు" గారి "29'X29' జంట పిరమిడ్ గోశాల" ఆశ్రమాన్ని "రాజుగారిపాలెం రవి" మరి "రాజుపాలెం సత్యనారాయణ" గార్లతో కలిసి నిర్మించాము. దాని నమూనా మరి నిర్మాణ విధానం .. ధ్యానంలో రవిగారికి మాస్టర్లచే ఇవ్వబడ్డాయి.

 

పత్రీజీ ఆదేశం మేరకు కర్నూలు నుంచి వెళ్ళి విశాఖపట్టణం ఏజన్సీ ఏరియా భీమ్‌సింగిలో ఉన్న పాకలపాటి గురువు గారి ఆశ్రమానికి వెళ్ళి .. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ధ్యాన కార్యక్రమాలు చేస్తున్న "దేవి", "రజిత"గార్ల సహకారంతో పూర్తి ఏజన్సీ ప్రాంతమైన "పెట్టుగోడల" గ్రామంలో 27'X27' మరి 12'X12' సైజులలో సుమారు 15 పిరమిడ్‌ల నిర్మాణంలో పాల్గొనడం ఒక మధురానుభూతి! అక్కడ ప్రతి ఊరులోనూ వారు సమిష్టిగా పనిచేసి ధనాన్ని ప్రోగు చేసుకుని పిరమిడ్‌లను నిర్మించుకోవడం ఎంతో అభినందనీయం! సమిష్టి కృషికి అవి చక్కటి ఉదహరణలు. ఈ విధంగా "పిరమిడ్‌ల నిర్మాణం వసుధైక కుటుంబానికి బాటలు వేస్తోంది" అనడంలో అతిశయోక్తి లేదు.

 

 

 

చంద్రకాంత రాజు

పిరమిడ్ ఇంజనియర్

విజయవాడ
సెల్: + 91094931 21033

Go to top