"  ‘గెట్ అవుట్’ అని తిట్టి .. బుద్ధి చెప్పిన సద్గురువు .. పత్రీజీ "

 

 

 

నా పేరు "రామాంజనేయులు". నేను నా భార్య "అనిత" ద్వారా 2014 జూలై నెలలో ధ్యాన పరిచయాన్ని పొందాను. 1990 సంవత్సరం నుంచే లారీ ఓనర్ కమ్ డ్రైవర్‌గా పనిచేస్తూన్న నేను రోజుకు పది ప్యాకెట్ల సిగరెట్లు, అంటే రోజుకు 1000/- రూ||తో పాటు మద్యం మాంసాహారం సేవిస్తూ నా సంపాదన అంతా కూడా వాటికే ఖర్చుపెట్టేవాడిని.

 

ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండమని నా భార్య నన్ను ఎంతగా పోరాడినా వినకపోయేవాడిని సరికదా .. "నిన్ను అయినా వదులుకుంటాను కానీ వాటిని ససేమిరా వదలను" అని ఆమెపై దౌర్జన్యం చేస్తూ ఇల్లు నరకంలా మార్చేవాడిని.

 

ఈ క్రమంలో మనశ్శాంతి కోసం ధ్యానం నేర్చుకున్న నా భార్య "నా భర్త సిగిరెట్లు, మద్యం, మాంసాహారం మానాలి" అని సంకల్పం పెట్టి 40 రోజులు ధ్యానం చేసింది! అంతలోనే గురుపౌర్ణమికి పత్రీజీ "నందవరం" వస్తూన్నారని తెలుసుకుని నన్ను బలవంతంగా సార్ దగ్గరకి పిలుచుకుని పోయింది. నాకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా నా భార్యను బాధపెట్టడం ఎందుకని .. నా లారీలో 40 మంది పిరమిడ్ మాస్టర్లను ఎక్కించుకుని నందవరం వెళ్ళాను. అక్కడ విపరీతంగా కురూస్తూన్న వర్షంలోనే అందరూ కూర్చుని ధ్యానం చేయడం చేసి "ఇదేం ఖర్మరా బాబూ?!" అనుకుంటూ నేను కూడా ధ్యానంలో కూర్చున్నా!

 

ధ్యానం అయిపోయిన తరువాత నా భార్య పత్రీజీని కలవడానికి నన్ను స్టేజీ దగ్గరికి తీసుకుని వెళ్ళగా నన్ను చూస్తూనే వారు "తాగుబోతు వెధవా! గెట్ అవుట్!" అన్నారు. కోపంగా .. పుట్టి బుద్ధెరిగిన తరువాత నన్ను అంతగా ఎవ్వరూ అవమానించలేదు. అన్ని చెడు లక్షణాలతో ఉన్నా మా నాన్న కూడా నన్ను పల్లెత్తు మాట అనలేదు. "ఈ రోజు ఈయనతో మాట పడవలసి వచ్చింది" నేను తెగ మధన పడిపోయాను.

 

వారం రోజులు తరువాత పామిడి గ్రామానికి అదోని పిరమిడ్ మాస్టర్ "ప్రేమనాథ్" గారు వస్తున్నారని తెలిసి నా అంతట నేనే అక్కడికి వెళ్ళి "మీ గురువు ఏం గురువు? ఎందుకు నన్ను తిట్టారు?" అని వారిని అడిగేశాను తీక్షణంగా! ప్రేమ్‌నాథ్ సారు కాస్సేపు కళ్ళు మూసుకుని "సార్ ‘గెట్ అవుట్’ అన్నది నిన్ను కాదు .. నీలో ఉన్న అజ్ఞానాన్నీ మరి నీలో ఉన్న త్రాగుబోతును. వెళ్ళి ధ్యానం చేసుకో" అని చెప్పారు.

 

ఇంటికి వచ్చాక మూడురోజుల పాటు "అంటే నాలో ‘త్రాగుబోతు’ అనే ఇంకొకడు ఉన్నాడా?" అన్న ఆలోచన నన్ను తొలిచివేసింది. నాలుగవరోజు అర్థరాత్రి నిద్రలో ఒక్కసారిగా నా శ్వాస ఆగిపోయింది! "ఇక నాకు చావు ఖాయం" అని తెలిసి గిలగిలా కొట్టుకుంటూ .. చివరి ప్రయత్నంగా శ్వాసను గమనించడం మొదలుపెట్టాను. క్రమక్రమంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి మామూలు స్థితికి వచ్చాను.

 

మరుసటిరోజు టీ త్రాగడానికి హోటల్‌కు వెళ్ళి టీ త్రాగిన తరువాత అలవాటు ప్రకారం సిగరెట్ ఇస్తూన్న హొటల్‌వాడిని కోపంగా చూసి "సిగరెట్ ఎందుకురా వెధవా? గెట్ అవుట్!" అని పత్రీజీ నన్ను తిట్టినట్లే తిట్టి ఇంటికి వచ్చేసాను. ఆ క్షణం నుంచి ఇక నేను సిగరెట్ ముట్టలేదు! సిగరెట్ కానీ .. మద్యం కానీ .. మాంసం కానీ .. "ముట్టాలి" అని కూడా నాకు మళ్ళీ అనిపించలేదు! ఇలా నా అంతట నేనే వ్యసనాల నుంచి విముక్తి పొంది ఇప్పుడు నా తోటి లారీ డ్రైవర్లకు కూడా ధ్యానం నేర్పిస్తూ శాకాహారం గురించి తెలియజేస్తూ దుర్వ్యసనాల బారినుంచి వారు బయట పడేలా కృషి చేస్తున్నాను.

 

నా భార్య ప్రోత్సాహంతో మా ఇంటి పై లక్ష రూపాయల ఖర్చుతో 14'X14' "నర్సింహ పిరమిడ్ ధ్యానమందిరం" నిర్మించుకుని చుట్టుప్రక్కల వారందరికీ ధ్యానప్రచారం చేస్తున్నాను! దుర్వ్యసనాలతో కూడి కిరాతకంగా బ్రతుకుతూన్న నన్ను "ఒక్క తిట్టుతో" చక్కటి ధ్యానమార్గంలోకి ప్రవేశపెట్టిన ధన్యజీవిగా మార్చిన సద్గురువు బ్రహ్మర్షి పత్రీజీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను! "గురువులు ఏం చేసినా, ఏం చెప్పినా అందులో ఏదో అర్థం పరమార్థం దాగి ఉంటుంది" అన్న ఆర్యోక్తి నా పట్ల సజీవ ఉదాహరణలా ఋజువైంది!

 

 

 

 

 

రామాంజనేయులు

గార్లదిన్నె

అనంతపురం జిల్లా
సెల్:+91 80089 91537.

Go to top