" పిరమిడ్ నిర్మాణం .. ఒక నిరంతర ప్రక్రియ "

 

 

నా పేరు కృష్ణచైతన్య. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‌గా పని చేస్తూన్న నేను .. నా 14వ యేట మా అమ్మగారి ద్వారా ధ్యాన పరిచయాన్ని పొందాను. 2004 సంవత్సరంలో మేము హిందూపురంలో ఉన్నప్పుడు పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన "గీతాధ్యానయజ్ఞం" సభలో మా అమ్మగారి బలవంతం మీద వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాను. పత్రీజీ వేణునాదామృత ధారలో మునిగి అందరూ గాఢ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు నేను ఒక కన్నుమూసి, ఇంకొక కన్ను తెరిచి తమాషాగా అందరినీ చూస్తూ అల్లంత దూరంలో స్టేజీపైన కూర్చుని ఉన్న పత్రీజీవైపు కూడా చూశాను. అన్ని వేల మందిలో కూడా ఎక్కడో కూర్చుని తమాషాలు చేస్తూన్న నన్ను స్టేజిపై నుంచే గమనించి కళ్ళు మూసుకోమని ఫ్లూట్‌తో సైగ చేసి చెప్పారు పత్రీజీ! అంతే వెంటనే రెండు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాను.

 

ధ్యానం అయిపోయిన తరువాత పత్రీజీ తమ సందేశం ఇస్తూ .. "ఎవరో ఏదో చెప్పింది చేయడం కాదు! మీకు నచ్చిన దానిని శాస్త్రీయంగా పరీక్షించి .. చెయ్యాలి" అని చెప్పారు. అది నన్ను చాలా ఆకర్షించి ఇక అప్పటినుంచీ మా అమ్మ నన్ను ధ్యానం చేయమనప్పుడల్లా" గురువుగారే మీకు నచ్చింది చేయమని చెప్పారు! నాకు ధ్యానం చేయడం ఇష్టం లేదు కనుక చేయను" అని తేల్చి చెప్పేవాడిని. పైనుంచి "నువ్వే గురువుగారు చెప్పినవి పాటించడం లేదు" అనడంతో ఆవిడ ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయేవారు!

 

నా పదవితరగతి అయిపోయాక మా నాన్నగారి వ్యాపారరీత్యా అన్నేళ్ళుగా ఉన్న స్నేహితులను వదిలి మేము బెంగళూరుకు తరలి వెళ్ళిపోవడంతో .. నేను దిగులుపడిపోయాను. ఆ సమయంలోనే బెంగళూరులో ఉన్న "PYMA వర్క్‌షాప్"లో పాల్గొని అక్కడ నా వయస్సులో ఉన్న "యంగ్ పిరమిడ్ మాస్టర్స్"తో పరిచయం పొందాను. చిన్నతనంలో ధ్యానం చేస్తూ మరింత ఉత్సాహంతో ఉన్న PYMA మాస్టర్లను చూసి స్ఫూర్తి చెంది వారితో స్నేహం పెంచుకుంటూ 2008 సంవత్సరం డిసెంబర్‌లో బెంగళూరులో జరిగిన ధ్యానమహాయజ్ఞంలో వాలంటీయర్‌గా నా సేవలను అందించాను! సేవా మార్గంలో ఉన్న తృప్తిని నాకు అందించిన గొప్ప కార్యక్రమం అది!అప్పటి నుంచి నేను ధ్యాన సాధనతో పాటు నా ప్రాపంచిక విద్యను కూడా కొనసాగిస్తూ ఇంటర్‌లో 80% మరి ఇంజనీరింగ్‌లో 94.38% మార్కులు సాధించి "యూనివర్సిటీ టాపర్"గా నిలిచాను. ఆ సమయంలోనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రచారంలో పాల్గొని రెండు లక్షల ధ్యాన శాకాహార కరపత్రాలను పంచడం, "ధ్యానకస్తూరి" పత్రికకు చందాదారులను చేర్పించడం, పత్రీజీ సూచన మేరకు "పిరమిడ్ ధ్యాన పబ్లికేషన్స్"ను స్థాపించి కన్నడ భాషలో ముద్రింపబడిన పత్రీజీ సందేశాలతో కూడిన జ్ఞానభాండాగారం (89,000) కాపీలను కర్నాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో పంచడం జరిగింది.

 

బెంగళూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ P.అయప్పచే రూపొందించబడిన "www.pyramidseverywhere.org" వెబ్‌సైట్‌లో దేశవ్యాప్తంగా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ద్వారా కట్టబడిన చిన్నా, పెద్దా పిరమిడ్ వివరాల నమోదు కార్యక్రమాన్ని గురించి తెలుసుకుని ఎంతో స్ఫూర్తిని పొందాను. అప్పటి నుంచి నా వారాంతపు సెలవుదినాల్లో బెంగళూరులోనే ఉన్న వెబ్‌‍సైట్ నిర్వాహకులతో కలిసి పనిచేస్తూ వచ్చాను.

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌ లో . ."పిరమిడ్ నిర్మాణం" అన్నది ఒక నిరంతర మహాప్రక్రియ! 2012 లో 367 నిర్మాణాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచగా .. 2015 సంవత్సరానికల్లా 1500 పిరమిడ్‌ల వివరాలను ఇందులో పొందుపరచడం జరిగింది! ఇంకా కొన్ని వందల పిరమిడ్‌ల సమాచారాన్ని సేకరించవలసి వుంది.

 

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‌గా చెన్నైలో ఉద్యోగం చేసుకుంటూ ఈ ప్రాజెక్టులో భాగంగా వారాంతపు సెలవుల్లో తెలంగాణ మరి ఆంధ్రరాష్ట్రల్లోని అనేక జిల్లాలలో విస్తారంగా పర్యటించి పిరమిడ్‍ల ఫోటోలనూ, పిరమిడ్‌ల వివరాలనూ సేకరిస్తున్నాను. ఈ క్రమంలో ఏప్రిల్ 12 వ తేదీ బెంగళూరులో పత్రీజీని కలిసినప్పుడు వారు .. "Be ready to accept everything, Krishna" అన్నారు. ఆ మాట వారు ఎందుకు అన్నారో తెలియకపోయినా .. "ఏదో ఒక పరిస్థితికి మాత్రం వారు నన్ను సమాయత్తం చేస్తున్నారు" అనుకుని "Sure sir, 100%" అన్నాను.

 

ఆ తరువాత ఏప్రిల్ 19 వ తేదీన మా నాన్నగారు "శ్రీ S.ప్రభాకర్"గారు హఠాన్మరణం చెందడం నన్ను తీవ్ర దుఃఖానికి గురిచేసినా .. ప్రతిక్షణం నన్ను వెన్నంటే ఉంటూ నాకు ముందే ధైర్యాన్ని అందించిన పత్రీజీకి సంపూర్ణ శరణాగతి అయ్యాను. నాన్నగారి మరణాన్ని 100% accept చేస్తూ .. పత్రీజీ సందేశాన్ని నా స్వానుభవంలా మలచుకున్నాను. నా జీవితంలోని ప్రతి ఒక్క మలుపుకూ, జ్ఞానానికీ మరి లక్ష్యానికీ మార్గదర్శకంగా నిలిచిన పత్రీజీకి శత కోటి ఆత్మప్రణామాలను తెలియజేసుకుంటున్నాను.

 

 

 

S.P. కృష్ణచైతన్య

చెన్నై
సెల్:- + 91 98400 84787

Go to top