" శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రం, ద్వారకాతిరుమల "

 

 

 

నా పేరు "కళాలక్ష్మి" .. నా భర్త శ్రీ గారపాటి సత్యనారాయణ గారు. మాది తాడేపల్లిగూడెం "శ్రీ శ్రీనివాస పిరమిడ్ ధ్యానకేంద్రం". నేను 2005లో భీమవరం తటవర్తి వీరరాఘవరావుగారి మూడు రోజుల శిబిరంలో పిరమిడ్ ధ్యానం నేర్చుకున్నాను.

 

నాకు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక ఆసక్తులు వుండేవి. మా నాన్నగారు ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ వుండేవారు. పూజలు, వ్రతాలు .. వీటిపట్ల ఇష్టాలు లేకుండా నేను మాత్రం నిరంతరం ఓంకార శూన్యంలో వుండేదానిని. థియోసోఫికల్ సొసైటీ సిద్ధాంతాలు నచ్చి దానిలో సభ్యురాలిగా చేరాను. ఒకసారి అడయార్ సమావేశాలలో పాల్గొన్నప్పుడు ఒక మాస్టరు "ఓంకార ధ్యాసలో వుండటం కాదు, ఓంకారం వినాలి" అన్నారు. దాని అర్థం నాకు అప్పుడు తెలియలేదు.

 

 

అప్పటికే మా అమ్మ, చెల్లి పత్రీజీని కలిసి "ఆనాపానసతి" ధ్యానం చేసేవారు, "ధ్యానాంధ్రప్రదేశ్" పత్రిక చదివేవారు. వారి దగ్గర వున్న ధ్యానాంధ్రప్రదేశ్‌లో ఒకావిడ తన ధ్యానానుభవంలో "నాభి నుంచి ఓంకారాన్ని స్పష్టంగా విన్నాను" అని వ్రాసారు, అది మా నాన్నగారు చదివి వెంటనే ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పారు. దానిలో తటవర్తి వీరరాఘవరావు గారి అడ్రసు - శిబిరం వివరాలు ఉన్నాయి. "ఆ ధ్యానం నేను కూడా నేర్చుకుని, ఆ ఓంకారం వినాలి" అని నేను ఆ శిబిరానికి భీమవరం వెళ్ళాను. అక్కడ "ఆనాపానసతి ధ్యానమే అన్నటికన్నా మిన్న" అని నాకు అర్థమైంది.

 

తటవర్తి వీరరాఘవరావు గారి ద్వారా పత్రీజీ అందించిన "ఆత్మజ్ఞానం" కేసెట్ విన్నప్పుడు .. "ఆధ్యాత్మిక విషయాలు ఇంత తేలికగా, ఇంతవరకూ ఎవ్వరూ వివరించ లేదు" అని బలంగా అనిపించింది. ఆనాటినుంచీ ధ్యానం చేస్తూ వీరరాఘవరావుగారి ప్రేరణతో "మేకా వెంకటేశ్వరరావు" గారితో కలసి అందరికీ ధ్యానం బోధిస్తూ వస్తున్నాను.

 

నా భర్త .. గారపాటి సత్యనారాయణగారు .. కూడా ఈ ధ్యానంపట్ల, పత్రీజీ బోధనల పట్ల ఆకర్షితులవడంతో మా ఇంటిపైన పిరమిడ్ నిర్మించాము. ఆ తదుపరి ఆయన మైత్రేయ బుద్ధా ధ్యాన విద్య విశ్వాలయం, బెంగళూరు ట్రస్టీగా నియమించబడి సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.

 

తరువాత "చిన్న తిరుపతి"గా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో 2007లో "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, పశ్చిమగోదావరి జిల్లా" వారి ఆధ్వర్యంలో మూడు రోజుల అన్నమయ్య సంగీత ధ్యాన యజ్ఞం జరిగింది.

 

ఆ యజ్ఞం ముగింపు సమావేశంలో పత్రి సార్ "ఈ ద్వారకా తిరుమలలో ఒక పెద్ద పిరమిడ్ వస్తుంది. దానితో పాటు ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడుతుంది" అని చెప్పారు. ఆ వెంటనే "ఆకుల త్రిమూర్తి"గారిని పశ్చిమ గోదావరి పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ ఏర్పాటు చేయమని పత్రీజీ ఆదేశించారు. గారపాటి సత్యనారాయణ గారు జీవితకాల అధ్యక్షులుగా 2007లో ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది.

 

ఆ తరువాత సత్యనారాయణ గారు, డాక్టర్ బలరామ్ ప్రతాప్ కుమార్‌ గారి ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలలో పిరమిడ్ నిర్మాణ స్థలం కోసం అన్వేషణ సాగింది. 2012లో "వడ్లమూడి మురళి"గారు, "దొరసానిపాడు" గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో కొండపైన పిరమిడ్ నిర్మాణ కోసం ఎకరన్నర స్థలం ఇవ్వటం జరిగింది. ఆ స్థలం ప్రక్కనే 500 సం||ల చరిత్ర కలిగిన ఒక పెద్ద మామిడి వృక్షం వుంది.

 

2014లో పత్రిసార్ పిరమిడ్ ప్రాజెక్ట్ డిజైన్ చేయమని మళ్ళీ త్రిమూర్తి గారికి చెప్పారు. ఆ ప్రదేశంలో 9 పిరమిడ్స్- 18'X18', 7పిరమిడ్స్ - 36'X36', ఒక పిరమిడ్ 72'X72' మహాపిరమిడ్ నమూనాను సిద్ధం చేశారు.2014 మార్చిలో శంఖుస్థాపన జరిగింది. వాటిలో నాలుగు పిరమిడ్‌ల నిర్మాణం పూర్తికాబడి 2015, మార్చి 27న పత్రీజీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరుపబడింది.


ఈ కార్యక్రమంలో .. "ఈ పిరమిడ్ పరిసరప్రాంతాలలో ఎందరో యోగులు తపస్సు చేశారు" అని పత్రీజీ వక్కాణించి చెప్పడం జరిగింది. విశిష్ట మామిడి వృక్షాన్ని తరతరాలుగా పోషిస్తున్న కుటుంబానికి చెందిన గంగ గారితో పాటు అనేక మంది వ్యక్తులు, ఆ స్థల ప్రాశస్త్యం గురించీ, ముఖ్యంగా అక్కడవున్న మామిడి వృక్షం గురించి ఎన్నో అనుభవాలు పంచుకోవటం జరిగింది.

 

అప్పుడు పత్రీజీ "ఇవి కాకమ్మ కథలు కావు, సత్య విషయాలు. ఈ చెట్టంతా ఒకానొక బ్రహ్మాత్మ ఆవరించింది వుంది. ఈ వృక్షపు శక్తే ఈ పిరమిడ్ రావటానికి దోహదం చేసింది. దానినుంచే ఆధ్యాత్మిక విజ్ఞానం, విశ్వవిద్యాలయం రూపంలో నలుదిశలా వెదజల్లబడుతుంది" అన్నారు. అంతేకాక, "అచ్చులలో ఆధ్యాత్మికతను" వివరిస్తూ

 

అ - అహింస
ఆ - ఆనాపానసతి
ఇ - ఇంగితజ్ఞానం/ఇంద్రియ నిగ్రహం ..
ఈ - ఈశ్వరుడు
ఉ - ఉన్నతి ..
ఊ - ఊర్థ్వలోకాలు/ఊర్థ్వాత్మ
ఎ - ఎరుక
ఏ - ఏకత్వం
అని చెప్పి వేణునాదంతో ధ్యానం చేయించారు. మిగిలిన పిరమిడ్‌ల నిర్మాణం త్వరలో పూర్తిచేసుకోవటానికి సంకల్పించుకుని, అందరి సహాయసహకారాలతో పనులు వేగంగా జరుపుకుంటున్నాము!

 

 

 

 

గారపాటి కళాలక్ష్మి

తాడేపల్లిగూడెం
పశ్చిమగోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్
సెల్:-+ 91 93482 22840

Go to top