" ప్రశాంతి పిరమిడ్ ధ్యానమందిరం "

 

 

నా పేరు "చంద్రకుమారి" నేను 1998 సంవత్సరంలో మా వారు శ్రీ మారం శివప్రసాద్ గారి మేనల్లుడు శ్రీ ప్రేమ్‌నాథ్ మాస్టర్ గారి ద్వారా పిరమిడ్ ధ్యానప్రపంచంలోకి వచ్చాను.

 

ధ్యానంలో మరి ధ్యానప్రచారంలో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకున్న నేను మా ఇంటి చుట్టుప్రక్కల మహిళలకూ మరి స్కూళ్ళల్లో, కాలేజీల్లో మరి ఆసుపత్రుల్లో విరివిగా ధ్యానప్రచారాలను చేపడుతూ వచ్చాను. 2007 సంవత్సరంలో డెక్కన్‌క్రానికల్ వార్తాపత్రికలో పనిచేసే పారడైజ్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గారితో కలిసి "చర్లపల్లి సెంట్రల్ జైలు" లో ఖైదీలకు 40 రోజుల ధ్యానశిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 

జైలు నిబంధన ప్రకారం సమయపాలనను ఖచ్చితంగా పాటిస్తూ వాసవీనగర్ పిరమిడ్ మాస్టర్ల సహకారంతో నేను 40 రోజులపాటు "ఒక ఉద్యోగంలా" ఆ ధ్యానశిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం ఒక గొప్ప అనుభవం!

 

అంతరంగ పరిశీలన ద్వారా స్వీయపరివర్తనకు దోహదం చేసే ఇటువంటి శాస్త్రీయమైన ధ్యానకార్యక్రమాల వల్ల సంతృప్తి చెందిన ఖైదీ సోదరులతో పాటు జైలు సిబ్బంది కోరిక మేరకు 2008లో మళ్ళీ ధ్యానశిక్షణా కార్యక్రమం సంవత్సరం పాటు అక్కడ నిర్వహించడం జరిగింది. ప్రతి ఆదివారం ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి "బ్రహ్మర్షి పత్రీజీ" తో పాటు "డా||న్యూటన్ కొండవీటి" గారు కూడా విచ్చేసి తమ సందేశాలను అందించారు.

 

ఆ తరువాత 2011 సంవత్సరంలో .. గతంలో నిర్వహించిన ధ్యానశిక్షణ వల్ల ఖైదీల ప్రవర్తనలో వచ్చిన మంచి మార్పును అధ్యయనం చేసిన జైలు సూపరింటెండెంట్ "శ్రీ శ్రీనివాసరావు"గారు, అప్పటి జైళ్ళ శాఖ డైరక్టర్ జనరల్ "శ్రీగోపీనాథ్ రెడ్డి"గారి విశేష సహకారంతో చర్లపల్లి జైలులో ధ్యానపిరమిడ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లందరి ఆర్థిక మరి హార్థిక సహకారాలతో అనేక లక్షల రూపాయలను వెచ్చించి అత్యంత ప్రతిష్టాత్మకమైన రీతిలో ఇక్కడ 27'X27' "ప్రశాంతి పిరమిడ్ ధ్యానమందిరం" నిర్మించడం జరిగింది.

 

ECIL పిరమిడ్ మాస్టర్ మరి ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శ్రీ మోహన్‌రావు గారి భూరి వితరణతో పాటు హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ K.విజయభాస్కర్ రెడ్డి దంపతులు, వైజాగ్ పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు P.V.రెడ్డినాయుడు సోదరులు, సూర్యాపేట ఎలక్ట్రిసిటీ D.E.శ్రీనివాస్ గారు మరి మార్టూరు పిరమిడ్ మాస్టర్ సుబ్బారావుగారు అందించిన ఆర్థిక వితరనలు వెలకట్టలేనివి!

 

చిన్న ఇసుక రేణువు కూడా లోపలికి వెళ్ళాలంటే ఎన్నెన్నో పర్మిషన్లు మరి తనిఖీలు అక్కడ తప్పనిసరి! అయినా కూడా ఎక్కడా విసుగు చెందకుండా ఒక పవిత్ర యజ్ఞంలా ధ్యానశక్తితో నిర్మించబడింది ఈ అందమైన పిరమిడ్! మధ్యలో కింగ్స్‌ఛేంబర్, చుట్టూ పూలతోటలతో రూపుదిద్దుకోబడి .. 2014, ఫిబ్రవరి 15వ తేదీన IPS అధికారి మరి ఆనాటి రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ "శ్రీ T.P.దాస్" గారిచే "ప్రశాంతి పిరమిడ్ ధ్యానమందిరం" గా ప్రారంభించబడింది.

 

ప్రస్తుతం అక్కడ ప్రతిరోజూ ఉదయం 7.00గం||నుంచి 8.30 గం||ల వరకు సాయంత్రం 4.00 గం||ల నుంచి 5.30గం||ల వరకు ధ్యాన ఖైదీ సోదరుల ఆధ్వర్యంలో ధ్యానశిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్" అధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం 11.00 గం||ల నుంచి మధ్యాహ్నం 1.00 గం||వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ధ్యానశిక్షణ అందించబడుతోంది.

 

అంతవరకూ "నా కుటుంబం" .. "నా ఇల్లు" .. "నా పిల్లలు" అంటూ వచ్చిపోయే వారికి వండి వడ్డిస్తూ కేవలం వంటింటికే పరిమితమైపోయి "అదే ప్రపంచం .. అందుకే నేను పుట్టాను" అనుకుంటూ అతి మామూలు గృహిణిగా బ్రతుకుతూన్న నేను .. నిరంతర ధ్యానసాధన ద్వారా నన్ను నేను ఒక శక్తివంతమైన ఆత్మస్వరూపంలా గుర్తించుకుని ధ్యానప్రచారం చేస్తూ నా జన్మను ధన్యం చేసుకుంటున్నాను.

 

ఒక అతిసాధరణ గృహిణిని .. సెంట్రల్ జైలులోని ఖైదీలకు కూడా ధ్యానవిద్య నేర్పించగల అత్యంత శక్తివంతురాలిగా మార్చిన ధ్యాన జగద్గురువు పత్రీజీకి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను!

 

 

 


సికింద్రాబాద్

చర్లపల్లి సెంట్రల్ జైల్‌లో
సెల్:+91 93472 42373

Go to top