" నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు "

 

 

నా పేరు "జయ వేణుగోపాల్". విశాఖపట్టణం జిల్లా "చింతల అగ్రహారం" గ్రామంలో నేను జన్మించాను. నా తల్లిదండ్రులు పిరమిడ్ మాస్టర్ "సత్యవతి", "రవీంద్రనాథ్"గార్ల పెంపకంలో నేను గత 15సం||లుగా ధ్యానం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉండేది. మా అమ్మగారు నాకు భగవద్గీత నేర్పిస్తూ .. ఆ శ్లోకాల భావాన్ని వివరించడంవల్ల భగవద్గీతాసారం నా జీవితానికి పునాదిలా నిలిచింది.

 

చిన్నప్పుడు స్కూలుకి నడుచుకుంటూ వెళ్తూ సూర్యునివైపు చూస్తూంటే నాకు "నేను ఎవరు?" .. "నేను ఎందుకు పుట్టాను" అనే ప్రశ్నలు నిరంతరం వచ్చేవి. అద్దం ముందు కూర్చుని నన్ను చూసుకుంటూంటే ఒక్కొక్కసారి "ఈ శరీరం నేను కాదు" అనే భావన నాలో కలిగేది.

 

"డా|| GK" గారి దగ్గర ధ్యానం నేర్చుకున్న అమ్మతో పాటుగా నేను కూడా మాంసాహారం మానివేసి ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను. చిన్నతనం వలన ధ్యానం శ్రద్ధగా చేసేవాడిని కాదు కానీ .. ఒకరోజు నాకు విపరీతమైన జ్వరం రావడంతో ఆ సమయంలో పిరమిడ్‌లో పడుకుని మెడిటేషన్ చేసాను. "అయిదు నిమిషాలు కూర్చుందాం" అనుకుని తెలియకుండానే "గంటసేపు" కూర్చోవడం జరిగింది!

 

ధ్యానం నుంచి లేచిన వెంటనే అంతకు ముందు వేడిగా వున్న నా శరీరం చల్లగా మారి జ్వరం మొత్తం మాయం అయిపోయింది! నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి ధ్యానం యొక్క శక్తి పూర్తిగా అర్థం అయ్యింది. ఆ క్షణం నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ పదవ తరగతిలో ఉండగా మా అక్క, పిరమిడ్ మాస్టర్ "ప్రమీల"తో కలసి వేసవి సెలవులలో పత్రీజీ ఇంటికి వెళ్ళాను.

 

పత్రీజీ, స్వర్ణమాల పత్రి మేడమ్ గార్లతో గడిపిన ఆ వేసవి సెలవుల రోజులు నా జీవితంలో అద్భుతమైన రోజులు! ప్రత్యక్షంగా మరి పరోక్షంగా కూడా పత్రీజీ దంపతులు తల్లితండ్రులకంటే మిన్నగా మాకు ఎన్నో విషయాలను నేర్పించారు. ఆ అమూల్యమైన ఘడియలను వృధా చేయకుండా వారి సమక్షంలో ధ్యానం చేసుకున్న నాకు ఆ సమయంలో కొన్ని అద్భుతమైన అనుభవాలు వచ్చాయి.

 

నా గత జన్మలను కొన్ని చూసుకోగలిగాను. కొన్ని గంటలపాటు అద్వితియమైన విశ్వమయప్రాణశక్తి మా బ్రహ్మరంధ్రం గుండా నా శరీరం మొత్తానికి గంగాధారలా వ్యాపించడం నేను అనుభవపూర్వకంగా గ్రహించాను. ఆ అనుభూతి మాటలతో చెప్పలేనిది. ఆ సమయంలో కొంతమంది ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి నాకు నా భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. 41 గం||ల ధ్యానం అనంతరం పత్రీజీ నన్ను "ధ్యానాంధ్రప్రదేశ్" ఆఫీసుకి పిలిచి .. "నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు" అన్నారు. "తనను తాను జయించిన వాడే ప్రపంచాన్ని జయించగలడు" అన్నది వారి సందేశంలోని అంతరార్థంగా నేను ఆ క్షణంలో గ్రహించాను. ఎందుకంటే "ప్రపంచ పర్యటన" చేయాలన్నది నా చిన్ననాటి కోరిక!

 

నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను చదువు పూర్తిచేసుకుని పత్రీజీ చెప్పిన జీవిత సూత్రాలను పాటిస్తూ వచ్చాను. ముఖ్యంగా "Life is all about what we choose to believe" .. "We create our own reality" అనే సూక్తులను మనఃస్పూర్తిగా విశ్వసించి ఎన్ని అడ్డంకులు, కష్టాలు వచ్చిన వాటిని ప్రేమపూర్వకంగా అంగీకరించాను.

 

మూడు సం||ల కాలంలోనే కొన్ని సందేశాత్మకమైన లఘుచిత్రాలను తీయడం మరి వాటిలో "స్వేచ్ఛ కోసం స్వేచ్ఛాజీవి ప్రయాణం"అనే లఘు చిత్రం చూసినవారు మాంసాహారాన్ని వీడడం ఎంతమంది అలవాటో తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా "చిత్ర దర్శకత్వం" పట్ల ఉన్న నా మక్కువను కూడా సఫలీకృతం చేసుకున్నాను!

 

అలా కొన్ని రోజులు వేచిఉన్న తరువాత నావికా వ్యాపారసంస్థ "Synergy Company" లో "C.E.భాస్కర్" గారి సహాయంతో నేను ఒక "నావికుడి" వృత్తిని సంపాదించుకున్నాను! ప్రస్తుతం సముద్రంలో ఓడ ప్రయాణాలు చేస్తూ వివిధ దేశాలకు తిరుగుతూ ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ఆయిల్ ఉత్పత్తులను పంపిణీ చేసే ఓడలో నావికుడిగా శిక్షణ పొందుతున్నాను .. ఇప్పటి వరకు కెనడా, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా దేశాల్లో తిరుగుతూ నేను రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శిస్తూ ఎంతో మందికి శాకాహారం పట్ల అవగాహనను కలిగిస్తున్నాను!

 

ఇక ముందు కూడా వృత్తిరీత్యా మరిన్ని ప్రపంచ దేశాలలో తిరుగుతూ ధ్యానప్రచారం చేయాలనీ, ప్రజలకు ఉపయోగకరమైన చిత్రాలను తియ్యాలన్నదే నా ఆకాంక్ష. నా ధ్యానశక్తి మరి నా సంకల్పశక్తి ద్వారా నా కోరిక తప్పకుండా తీరుతుంది! "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్"లో ఉంటూ నేను నేర్చుకున్న ప్రప్రధమైన పాఠం .. ఆనందంగా జీవించటం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఆనందంగా ముందుకు సాగడం కేవలం ఒక్క పిరమిడ్ మాస్టర్‌కు మాత్రమే సాధ్యం! ఇటువంటి బ్రహ్మవిద్యను మనకు అవలీలగా అర్థం అయ్యేటట్లు బోధిస్తూ మనలను ముందుకు నడిపిస్తూన్న ప్రియతమ పత్రీజీకి వేల వేల ప్రణామాలు .. కోటి కోట్ల కృతజ్ఞతలు!

 

 

 

బొడ్జేటి జయ వేణుగోపాల్

విశాఖపట్టణం
సెల్: +91 99853 13423

Go to top