" మా జీవితాలలో అద్భుతమైన మార్పు "

 

 

నా పేరు "అంజి". రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌ల సంయుక్త అధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల వారికోసం "ఇందిరమ్మ 07/08 గృహనిర్మాణ పథకం" ద్వారా నిర్మించబడిన "పిరమిడ్ మోడల్ కాలనీ"లోని నలభై ఇళ్ళలో నాది ఒకటి!

 

లబ్ధిదారులమైన మేము చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఉంటూ మా ఇంటి నిర్మాణ పర్యవేక్షణ కోసం ప్రతిరోజూ "నాగులవంచ" గ్రామనికి వచ్చివెళ్ళేవాళ్ళం. పిరమిడ్ ఇళ్ళన్నింటినీ దగ్గర ఉండి కట్టించిన సరోజ మేడమ్ కూడా ఒక ఉద్యోగిలా ప్రతిరోజూ ఖమ్మం నుంచి టిఫిన్ క్యారేజి కట్టుకుని ఉదయమే వచ్చి .. ఎండనక, వాననక మాతో పాటే అర్థరాత్రి వరకు అక్కడే ఉండి పనులను పర్యవేక్షించేవారు! ప్రతిరోజూ పని మొదలుపెట్టబోయేముందు నిర్మాణ కూలీలతో పాటు మా లబ్ధిదారులందరితో కూడా వారు ధ్యానం చేయించేవారు!

 

అంతకు ముందు నేను కిలోలకు కిలోల మాంసం తింటూ, సీసాలకు సీసాలు మద్యం త్రాగుతూ సంపాదించిన డబ్బంతా నా ఒక్కడికే ఖర్చుపెట్టుకుంటూ నా భార్యపిల్లలను కూడా తిండికి మాడ్చేవాడిని. ధ్యానం చేస్తూన్నప్పటి నుంచీ నాలో ఎంతో మార్పు. మాంసం మీద విరక్తి కలగడం, మద్యం వాసన పడకపోవడంతో వాటన్నింటికీ దూరంగా ఉంటూ మా కుటుంబంతో సహా శుద్ధశాకాహారుల్లా జీవిస్తున్నాము!

 

పత్రీజీ మాటలు, పాటలు నా సెల్‌ఫోన్‌లోనే రికార్డు చేసుకుని వాటిని మైకులో పెట్టి ఇంటి నిర్మాణం పనులు చూసుకునే వాళ్ళం. చూడముచ్చటైన పిరమిడ్ గృహాలతో తీర్చిదిద్దినట్లున్న మా "మైత్రేయ బుద్ధ పిరమిడ్ గృహ సముదాయం" పరిశుభ్రమైన రోడ్లతో "స్వచ్ఛబారత్"కు ప్రతిరూపంగా నిలుస్తోంది. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి మరి మురుగునీటి పారుదల వ్యవస్థ ఇక్కడ అత్యంత నాణ్యంగా ఏర్పాటు చేయబడ్డాయి!

 

ఆడకూతురైనా సరే పట్టుదలతో సరోజమ్మ మా కోసం ఇంత గొప్ప పని చేయడం మాకు ఎంతో ఆదర్శంగా నిలిచింది. ఆ అమ్మ కొని ఇచ్చిన మోటర్‌బైక్ పై తిరుగుతూ నేను కూడా మిగతా ఇళ్ళ నిర్మాణాన్ని పర్యవేక్షించాను! 2012 జనవరి 20 వ తేదీన గురువుగారి పత్రీజీ వచ్చి మా గృహాలను ప్రారంభం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి మా అందరి ధ్యానవందనాలు!!

 

 

నాదెండ్ల అంజి

నాగులవంచ గ్రామం
చింతకాని మండలం

ఖమ్మంజిల్లా

Go to top