" జీవహింస నుంచి ధ్యానప్రచారం వరకు "

 

 

నా పేరు "ఉమాశంకర్ రెడ్డి". నేను, నా కుటుంబం గతంలో మాంసాహారులం. ఇప్పుడు అంటే 2009 సంవత్సరం జూలై 22 నుంచి శాకాహార ధ్యానులం. ఈ మార్పు ఎలా జరిగిందో వివరిస్తాను.

 

నేను మాంస ప్రియుడిని. ఎందుకంటే నా తల్లిదండ్రులు మాంసాహారులు. వారు అజ్ఞాన జీవన విధానంలో ఉండి నాకు కూడా వారి అజ్ఞాన ఆహార అలవాట్లలూ, వారి మూఢనమ్మకాలూ మరి జంతుబలులూ నాకు అలవాటు చేసారు. వాటిలో కొన్ని ..

 

ప్రతి సంవత్సరం కార్తీకమాస చివరి సోమవారం నాడు ప్రొద్దుటూరు "మునిస్వామి"కి కోడిపుంజుని బలిగా ఇవ్వడం. అలాగే ప్రతి మూడు సంవత్సరాలకు "కాట్రేవుడు" (జమ్మిచెట్టు)కు నల్ల కోడిపెట్టను బలిగా ఇవ్వడం, "ఉగాది" రోజు దేవర్లకు మేకలకు, పొట్టేళ్ళను మేపి బలిగా ఇవ్వడం మా ఆచారం. వీటి ద్వారా నాకు మంసదాహం మరింత ఎక్కువైంది. కానీ నాకు భక్తి కూడా ఎక్కువే. అయితే, దాని వలన ఎలాంటి ఉపయోగం లేకపోగా, నాలో ఏదో వెలితి మొదలయ్యింది. నా దేహంలో అదురు, భయం, సోమరిగా ఉండడం గమనించసాగాను.

 

అప్పుడు మొదలైంది నాలో తపన, "ఇక భయాల జీవితం వద్దు, ప్రశాంత జీవితం కావాలి .. ‘తరువాతితరం’ అంటే నా పిల్లలకు భయాందోళనల జీవితం వద్దు; శాంతం, సౌఖ్యం, ఆనందం కావాలంటే ఎలా?" అని నాలో నేను అన్వేషించసాగాను. అప్పుడు దొరికింది బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ జీవనవిధానం!

 

"ఇక ఎందుకు ఆలస్యం?" అని వెంటనే మా అమ్మగారితో "అమ్మా! ఇక నుంచి ఏ మునిస్వామికి గానీ, కాట్రేవుడికి గానీ, ఏ దేవర్లకు గానీ ఏ జీవినీ బలి ఇవ్వను" అని చెప్పి ప్రొద్దుటూరు పిరమిడ్ మాస్టర్ ద్వారా మా ఇంట్లో 2'x2' పిరమిడ్ ఇంట్లో పెట్టించి 41 రోజులు సామూహిక ధ్యానం మొదలుపెట్టాం.

 

ఎప్పుడైతే నేను మాంసం మానివేశానో అప్పటి నుండి నా దేహం శక్తివంతం మరి కాంతివంతమైంది. "ఇక ఎందుకు ఆలస్యం?" అని "నేను ఏదైతే తెలుసుకున్నానో దానిని ఇతరులకు కూడా తెలియజేయాలి" అని నా స్నేహితులకూ, బంధువులకూ చెప్పి వారిని కూడా శాకాహార ధ్యాన కుటుంబాలుగా మార్చాను. మా చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి శాకాహార ధ్యానప్రచారం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

 

కనుక మిత్రులారా! ఈ దేహమే దేవాలయం, వైకుంఠము, కైలాసం కనుక దయచేసి మాంసాహారం, మద్యం, ప్రొగత్రాగడం మానండి. ఈ శరీరానికి శాకాహారం మరి ఫలహారాలే శ్రేష్ఠం. ప్రతి రోజూ ధ్యానం, సత్సంగం, స్వాధ్యాయాల ద్వారా ఈ శరీరం శక్తివంతమౌతుంది, కాంతివంతమౌతుంది, పవిత్రమౌతుంది కనుక ఈ శాకాహార ధ్యానమహాయజ్ఞం ద్వారా మనకు మనం మేలు చేసుకుందాము. ఈ జన్మను సార్థకం చేసుకుందాము.

 

బ్రహ్మర్షి పత్రీజీకి కృతజ్ఞతలతో ..

 


పాలగిరి ఉమాశంకర్ రెడ్డి

ప్రొద్దుటూరు

కడప జిల్లా

93913 52909

Go to top