" మౌనధ్యానం - మరుపురాని అనుభూతి "

 

 

 

నా పేరు "శ్రీనివాసరావు". నేను 2007లో ఈ ధ్యానంలోకి వచ్చాను. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని సమస్త మానవాళికి అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీకి శతసహస్రకోటి ధన్యవాదాలు.

 

ఒంగోలులోని "శ్రీనివాస రెసిడెన్సీ"లో ఉన్న "నన్నూరి పిరమిడ్ ధ్యానకేంద్రం"లో మే, 3 నుంచి 5 వ తేదీ వరకు శ్రీ తటవర్తి వీరరాఘవరావుగారి ఆధ్వర్యంలో బుద్ధపౌర్ణమి సందర్భంగా "3రోజులు - 30 గంటలు మౌనధ్యానం" నిర్వహించబడింది. ఈ కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పచ్చని చెట్లతో, అందమైన ప్రకృతిలో ఈ ధ్యానంలో పాల్గొన్న ధ్యానులందరూ పులకించిపోయి, వేసవి వాతావరణం అనిపించలేదనీ, చల్లని గాలులతో హాయిగా ఉందనీ పేర్కొనడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులందరూ తమలో అద్భుతంగా మార్పులు వచ్చాయనీ మౌనం వలన మాటలమీద అదుపు, మాట మీద ఎరుక వచ్చిందనీ పేర్కొన్నారు. రోజుకి పది గంటలు ధ్యానం చేసినా కొంచెంసేపు కూర్చున్నట్లుగా అనిపించిందని సమయం తెలియలేదనీ తెలియజేశారు.

 

"ఆత్మజ్ఞానం కోసమే ధ్యానం" అని తటవర్తి వీరరాఘవరావుగారు అద్భుతంగా వివరించారు. మన పనులను బట్టే మన జీవితం వుంటుందనీ, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలనీ వివరించారు. మన పనులను బట్టే మన జీవితం వుంటుందనీ, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలనీ వివరించారు. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొందితేనే అన్ని సమస్యల నుంచి బయటపడతారని అన్నారు. మనోస్థితినుండి ఆత్మస్థితికి వెళితేనే అన్ని కష్టాలకు అతీత స్థితిలో ఉంటారు.

 

ఉదాహరణకి రమణమహర్షికి కాన్సర్ ఉన్నా ఆయనకి బాధలేదు. జీసెస్ ఆత్మస్థితిలో ఉన్నాడు కనుకనే మేకులు గుచ్చుకున్నా ఆయనకి బాధలేదు అని వివరించారు. ఆత్మజ్ఞాని "తాను ఆత్మ" అని తెలుసుకోవడమే కాదు, "అందరిలో ఉన్న ఆత్మ తానే" అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఎప్పుడైతే "అంతా నేనే" అని తెలుసుకుంటాడో అప్పుడు అతడు ఎవ్వరినీ ద్వేషించడు, ఎవ్వరినీ మోసగించడు. ఏ జంతువునీ బాధించడు, హింసించడు. మనస్సు శూన్యమైతేనే ఆత్మ వ్యక్తమవుతుంది. "మనస్సును శూన్యం చేసే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే" అని వారు వివరించారు.

 

మౌనధ్యానం వల్ల అంతర్గంతంగా ఎన్నెన్నో మార్పులు జరుగుతాయి. అంతర్‌శుద్ధి జరుగుతుంది, తద్వారా గుణాలు మారతాయి. గుణాలు మారడం వలన ప్రవర్తన మారి పనులు మారతాయి. మంచిగా ప్రవర్తించగలుగుతాం. జీవితంలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతుంది. ఆత్మస్థితి పెరిగి ఆత్మజ్ఞానం అభివృద్ధి చెందుతుంది.

 

ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని రెసిడెన్షియల్‌గా నిర్వహించడం అందులో నేను, నా భార్య వాసంతి పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం.

 

 

నన్నూరి శ్రీనివాసరావు

ఒంగోలు

ప్రకాశం జిల్లా

Go to top