" పిరమిడ్‌లు భూమి మీద నెగెటివిటీని శుభ్రం చేస్తాయి "

 

 

నా పేరు "రవిరాజు." నా భార్య అరుణ, మా అబ్బాయి వంశీకృష్ణం రాజు. మా ఊరు రాజుగారిపాలెం. నాకు ధ్యానపరిచయం జరిగి సుమారు 12 సం||లు అవుతోంది. నాకు ఎకరం యాభై సెంట్లు పొలం ఉంది. నేను కూరగాయల మార్కెట్లో ముఠాపని చేసేవాడిని. దానితో పాటు గ్రానైట్ ఫ్యాక్టరీలో పాలిష్ వర్క్ చేసేవాడిని.

 

పనికి వెళ్ళిన తరువాత వెన్నుపూస నడుము కలిసే దగ్గర పట్టుకుపోయి విపరీతమైన నొప్పి వచ్చింది. నరసరావుపేటలో ఎముకల డాక్టర్‌ని కలిస్తే ఎక్స్‌రేలు తీసి "వెన్నుపూసలో డిస్క్‌ల మధ్య కుషన్ అరిగింది" అని చెప్పి .. "ఎక్కువగా మాంసం తిను, చెక్కబల్లపై పడుకో, మందులు వాడు" అని చెప్తే, 13,14 నెలలు అలానే చేశాను. నా దగ్గరున్న డబ్బులు అయిపోయి డాక్టర్‌ని "తగ్గటానికి ఇంకా ఎంతకాలం పడుతుంది?" అని అడిగితే "ఇంకా రెండు సంవత్సరాలు పట్టవచ్చు" అన్నారు. అప్పుడు నాకు యోగాసనాలు నేర్పిన గురువుగారు గుర్తువచ్చి ఆయన దగ్గరకు వెళ్ళి నా పరిస్థితి చెప్పాను.

 

ఆయన "ఏం చేద్దాం నాన్నా! పూర్వజన్మ కర్మ అనుభవించు" అన్నారు. నేను తమాయించుకుని "ఏవండీ నిన్న మొన్న తిన్న కూరే గుర్తులేదు, మరి గతజన్మ ఎలా గుర్తుంటుంది? సరే ఆ కర్మ తొలగిపోవటానికి ఏం చెయ్యాలో చెప్పండి? అని అడిగితే ఆయన వద్ద సమాధానం లేదు.

 

మొక్కుకుందామని తిరుపతి వెళ్ళి దణ్ణం పెట్టాక చూస్తే జనం ఎక్కువగా ఉన్నారు. "కాళహస్తిలో దేవుడు ఖాళీగా వుంటాడు కదా" అని అక్కడకు వెళ్ళాము. గుడిబయట పిరమిడ్ కేర్‍సెంటర్ అతను పిలిచి ధ్యానం చేయించాడు.

 

అక్కడ "సంకల్ప శక్తి" పుస్తకం చూసి ఎవరి దగ్గరనుంచి అయినా ఫోన్ రావటం గురించి వాదించాను. చివరికి "సరే" అని పుస్తకం, పిరమిడ్, ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చి 30 నిమిషాలు ధ్యానం చేస్తే నాకు ఫోన్ రాలేదు. అతనికి ఫోన్ చేసి అడిగితే "నీ దగ్గర సరిపడినంత సంకల్ప శక్తి ఉండాలి; అందుకు మూడు గంటల నుంచి ఐదు గంటలపాటు ధ్యానం చెయ్యాలి" అన్నాడు.

 

పట్టుదలగా 30 రోజుల్లో ఐదు గంటలకు వచ్చాను. 110 రోజుల కల్లా నా వెన్నుపూస క్లియర్ అయ్యింది! మా బావ దగ్గర్నించి ఫోన్ రావాలని సంకల్పిస్తే వచ్చింది. నమ్మకం లేదు. "బావే కదా" అని, వేరే ముస్లిం ఫ్రెండ్ గురించి అనుకుంటే అదీ వచ్చింది! మరుసటిరోజు నాతో మాట్లాడని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్ రావాలని సంకల్పిస్తే అదీ వచ్చింది! ధ్యాన తరంగాలు పనిచేస్తాయని అప్పుడు నమ్మకం కుదిరింది.

 

విజయవాడ నరసరాజుగారు వాళ్ళ నాన్న చనిపోతే పంచిన "లేదు మరణం" అనే పుస్తకం నా దగ్గరకు చేరింది. ఆ పుస్తకం నా జీవితాన్నే మార్చివేసింది. నరసరాజుగారు ప్రతిరోజూ ఫోన్ చేసి పుస్తకం చదవమనీ, ప్రచారం చెయ్యమనీ, జీవితలక్ష్యం తెలుసుకోమనీ తెలియజేస్తూ మాస్టర్లను నా దగ్గరికి పంపించటం చేశారు.

 

నేను గంటలు గంటలు ధ్యానం చాలా రోజులు చేశాక ఒక రోజు నా జీవితలక్ష్యం కనిపించింది. ధ్యానంలో నేను ధ్యానం చేస్తూ కనిపించాను, గడ్డాలు, మీసాలు, నా ఒంటిమీద వెంట్రుకలు నేల మీద పరుచుకుని కనిపించాయి. "300 సంవత్సరాలు ధ్యానం చేశాను" అని తెలిసింది. "అన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తే ముక్తిని పొందాలి కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా?" అని ప్రశ్నిస్తే "తెలుసుకున్నావు గానీ, ఎవ్వరికీ నేర్పలేదు" అని వినిపించింది.

 

"మరి ఇప్పుడు ఏంచెయ్యాలి?" అని ప్రశ్నిస్తే 101 పిరమిడ్‌లు కనిపించాయి. "వాటిలో ధ్యానం చెయ్యాలా?" అని అడిగాను .. "కాదు కట్టించాలి" అని చెప్పారు. "డబ్బులు ఇచ్చినా, పని చేసినా, కట్టడానికి సహకరించినా పిరమిడ్ కట్టించినట్లే" అని చెప్పారు.

 

"పిరమిడ్‌కీ, ధ్యానప్రచారానికీ సంబంధం ఏంటి?" అని ప్రశ్నిస్తే "పిరమిడ్ దానికదే నిరంతరం ప్రచారం చేస్తుంది! అది ఇతర నక్షత్రాల మరి గ్రహాల కాంతి కిరణాలని స్వీకరించి భూమి మీద ఉన్న నెగెటివిటీ శుభ్రం చేస్తుంది" అని చెప్పారు. ఆరోజు నుంచి క్లాసులు చెప్పటానికీ, పిరమిడ్స్ నిర్మించటానికీ నిర్ణయించుకుని ఇప్పటి వరకు సుమారు 125 పిరమిడ్‌లు కట్టించాను! నేను సత్యనారాయణగారు లేజర్ వెల్డింగ్ బేల్దారు శ్రీను కలిసి ఉచితంగా పనిచేశాము. ఛార్జీలు కూడా మావే!

 

నా కుటుంబం ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. తెలుసుకున్నాం కాబట్టి ఉన్నంతలో సర్దుకుని బతుకుతూ, పిరమిడ్స్ నిర్మాణం, ధ్యానప్రచారం ద్వారా జీవిస్తున్నాం. సంకల్ప శక్తితో ఇల్లు, సెల్లు, TV, మోటార్‌సైకిల్, గ్యాస్‌స్టవ్, రైస్‌కుక్కర్ అన్నీ పొందాం.

 

సంకల్పంతో 15'x15' పిరమిడ్ కింగ్స్‌ఛేంబర్‌తో సహా నిర్మించాము. నాకు ఉన్న పొలంలో పైరు చేతికందే సమయానికి ఎల్లవపడేది. ధ్యానంలో కారణం తెలిసింది. నేను గతంలో తాగుతూ ఎదుటి వాళ్ళ పంటకుప్పలు తగలబెడుతూ కనిపించాను. వాళ్ళందరూ ఆర్పాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. "మరి ఇప్పుడేం చెయ్యాలి?" అని ప్రశ్నిస్తే "పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు" అని అక్షరాలు కనిపించాయి.

 

వారిని క్షమించమని అడిగితే మగవాళ్ళు "క్షమించాము" అన్నారు. ఆడవాళ్ళు క్షమించలేదు. ఆ రోజు 12 గంటలు ధ్యానం చేశాను. అప్పుడు పత్రిగారు గుర్తు వచ్చి సహాయం అడిగాను. మరుక్షణం వాళ్ళు నవ్వుతూ "క్షమించాం" అని చెప్పారు. నేను అంతకు ముందు జన్మలు లేవు అనుకునేవాడిని. కానీ ఆ తరువాత నుంచి ఈ రోజు వరకు ఎల్లవపడి పంటనష్టం కలగలేదు. పంట ఇంటికి చేరుతోంది. దటీజ్ పత్రీజీ!

 

నా పళ్ళు కదిలి, చిగుళ్ళు పాడయిపోయి చీము కారేది. దానికి కారణం ధ్యానంలో తెలిసింది. "నేను చిన్న పిల్లోడిగా కనపడుతూ, చెట్టుమీద ఉన్న ఒక కోతికి రాయివేస్తే అది దాని మూతికి తగిలి రక్తం కారుతు కనిపించింది. కోతిలోని ఆత్మను క్షమించమని అడిగాను. మరుసటిరోజు నుంచి చిగుళ్ళనుంచి చీము కారటం ఆగి పళ్ళు గట్టిపడ్డాయి. "రాయితో కొడితేనే అంత జరిగితే .. మరి కోళ్ళు, మేకలు, చేపలు ఇలా కోసుకుని తినే పరిస్థితి ఇంకెంతో!" అని భయం వేసి, అందరినీ శాకాహారులుగా మారమని ప్రచారం చేస్తున్నాను. ఒకసారి ధ్యానంలో బుద్ధుడు కనపడి "సకల ప్రాణికోటి పట్ల ప్రేమగా ఉండటమే ధర్మం" అని చెప్పారు.

 

మేము ఒంగోలు జిల్లా మార్టూరులో "పిరమిడ్ కేర్ సెంటర్" పెట్టాం. దానిని నా భార్య "అరుణ" చూసుకునేది. పరీక్షేమో అన్నట్లు రోడ్డు రిపేరు వచ్చి బస్సులు ఆగిపోయాయి. ప్రతిరోజూ ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళి వచ్చేది. ఒకరోజు కాళ్ళు నొప్పులుగా వుండి తను పిరమిడ్‌లో పడుకుంటే ఆ జగద్గురువు పత్రీజీగారు కాళ్ళు వత్తుతూ కనిపించారని ఉలిక్కిపడి లేచింది. ఆ గురువు ప్రేమకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?!

 

మా ఊర్లో మెదడులో నరాలు చిట్లి, ఏదీ గుర్తుపట్టలేక, ఆహారం కూడా స్పూన్‌తో పోసే పరిస్థితుల్లో వున్న వ్యక్తి మంచం పైన మూడు 2'x2' పిరమిడ్‌లు వరుసగా వ్రేలాడదీశాము. అలానే ఆయన భార్యకి చెప్పాను "కర్మ ఆయనది కాదు, మీది! అందుకని మీరు మంచం ప్రక్కనే కూర్చుని ధ్యానం చెయ్యాలి" అని. వాళ్ళు అలానే చేసారు. ధ్యానశక్తి, పిరమిడ్ శక్తితో అయిదు నెలల్లో ఆరోగ్యం పూర్తిగా కోలుకుని పొలం పని కూడా చేసే స్థితికి వచ్చాడు దటీజ్ పిరమిడ్‌శక్తి!

 

స్కూల్లో పిల్లలతో మూడు సంవత్సరాలపాటు రోజు నా భార్య ధ్యానం చేయించింది. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అటెండెన్స్, జ్ఞాపకశక్తి పెరిగింది,పిల్లలు శాకాహారులయ్యారు. వాళ్ళ తల్లితండ్రులను కూడా మాంసాహారం మాన్పించే ప్రయత్నం చేసి చాలామంది ఫలితం పొందారు!

 

ఇంకా వందల అనుభవాలు వున్నాయి! మా గ్రామంలో ఆరు పిరమిడ్‌లు వున్నాయి. పత్రీజీ గారి పుట్టినరోజు నుంచి .. ఐదు కిలోమీటర్లు రోడ్డుకి రెండు వైపులా .. మొక్కలు నాటి పెంచుతున్నాము. 16 గ్రామాల్లో 180 మందితో శాకాహార ర్యాలీలు చేశాం.

 

అమరావతి ధ్యానమహాచక్రానికి చందాగా ప్రోగుచేసి ఇచ్చాను. కడ్తాల్ ధ్యానమహాచక్రానికి పెద్ద లారీ కూరగాయలు పంపించే అదృష్టం లభించి, సఫలం చేసుకున్నాను. పిరమిడ్‌లు కట్టించటానికి తిరిగేటప్పుడు బైక్ కొంచెం పెట్రోల్‌తో 150,160 కిలోమీటర్లు తిరిగి వచ్చేది .. అలా చాలాసార్లు జరిగింది! పిరమిడ్ పార్టీ తరపున MLAగా పోటీ చేసే అవకాశం, అదృష్టం నాకు ఇచ్చిన పత్రీజీకి వేలకొద్ది కృతజ్ఞతలు! ఎలక్షన్‌ల కోసం 120 గ్రామాల్లో రెండుసార్లు ధ్యాన-శాకాహార ప్రచారం నిర్వహించడంజరిగింది!

 

125 పిరమిడ్‌లు నిర్మించటానికి సహకరించిన విజయవాడ సత్యనారాయణ గారికీ, చీరాల ఆదిశేషు గారికీ, మాధవ వర్మ గారికీ, మోహన్ గారికీ, చంద్రకాంత రాజుగారికీ, అలానే మా తల్లిదండ్రులు వెంకటేశ్వరరాజు, శాంతకుమారి గార్లకూ .. మరి ఇన్నింటికీ మూలమయిన పత్రీజీకి కృతజ్ఞతలు!

 


సామంతపూడి రవిరాజు

రాజుగారిపాలెం

ప్రకాశం జిల్లా 

ఆంధ్రప్రదేశ్

+91 81790 33535

Go to top