" అంతర్గత శక్తిని పెంపొందించే పిరమిడ్ ధ్యానం "

 

 

నా పేరు "రమేష్". నేను ధ్యానంలోకి వచ్చి 16 సంవత్సరాలు అయ్యింది. నేను 10 వ తరగతిలో ఉండగా చంద్రగిరి పిరమిడ్ మాస్టర్ శ్రీనరేంద్రగారి ద్వారా పత్రీజీ ధ్యానశిక్షణా తరగతికి వెళ్ళాను. అప్పటి నుంచి నిరంతరం ధ్యానం చేస్తూ, ధ్యానప్రచారం చేస్తూ నరేంద్ర గారు ఇచ్చిన అనేకానేక నవీన ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ పత్రీజీ క్యాసెట్లను వింటూ నన్ను నేను ఒక ఆత్మజ్ఞానిలా మలచుకున్నాను.

 

పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుని ఒక 4'x4' పిరమిడ్‌ను తయారు చేసుకుని అందులో కూర్చుని రాత్రంతా ధ్యానం చేసి ఎందరో ఆస్ట్రల్ మాస్టర్ల శక్తి తరంగాలను అనుభూతి చెందేవాడిని. 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ "శ్రీ లోబ్‌సాంగ్ రాంపా పిరమిడ్" లో 41 రోజులపాటు ధ్యానం చేసి అనేక లోకాలకు చెందిన మాస్టర్‌ల సందేశాలను అందుకున్నాను.

 

ఈ క్రమంలో నాకు తిరుపతి "S.V.యూనివర్సటీ"లో M.Com సీటు రాగా .. పత్రీజీ నన్న కడప S.V.P.G. కాలేజీలో M.Com చేయమని చెప్పారు. దాంతో కడప రాయచోటి రోడ్డులో నూతనంగా నిర్మించిన "శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యానకేంద్రం"లో రెండు సంవత్సరాల పాటు ఉండి ఆ కాలేజీలో M.Com డిగ్రీని ప్రథమ శ్రేణిలో పూర్తిచేశాను. ఆ సమయంలోనే నేను కడప పిరమిడ్ మాస్టర్ మురళీగారి ద్వారా పిరమిడ్ నిర్మాణం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను.

 

2005 సంవత్సరం నుంచి ఎక్కడ పత్రీజీ క్లాసులు జరిగినా అక్కడికి వెళ్ళి 1'x1' .. 2'x2' .. 3'x3' .. 4'x4' పిరమిడ్‌లతో మరి పుస్తకాలతో స్టాల్స్ నిర్వహించి కొన్ని వందల హాంగింగ్ పిరమిడ్‌లనూ మరి కొన్ని వేల పిరమిడ్ క్యాప్‌లనూ అందించాను. అనేక గ్రౌండ్, రూఫ్‌టాప్ మరి పిరమిడ్ హౌస్‌ల నిర్మాణాల్లో పాలుపంచుకున్నాను. ఈ క్రమంలో నాకు కలిగిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను.

 

పిరమిడ్‌లో ధ్యానం ఎంతో శక్తివంతమైనది. మన పుట్టుక మరి కర్మల గూర్చి పిరమిడ్ ధ్యానం చేయడం వలన మనకు పూర్తి అవగాహన వస్తుంది. గంటలు గంటలు పిరమిడ్‌లో ధ్యానం చేయడం వలన మనం కష్టసుఖాలకు అతీతంగా ఉంటాము. పిరమిడ్‌లో ధ్యానం చేయడం వలన మన ఆరా మరి మన శరీర స్థితిలో మార్పు వచ్చి మనం అంతర్గత శక్తివంతులుగా మారుతాము.

 

పిరమిడ్ శక్తితో కొన్ని వేలమంది ఎన్నో రకాల జబ్బులు, సమస్యలు దూరం చేసుకున్నారు. కొంతమంది పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ అన్ని జబ్బులను పోగొట్టుకుని తమ తమ కర్మలను పూర్తిగా తీర్చుకుని తమ తమ శరీరాలను వదిలి ఇతరలోకాలకు హాయిగా వెళ్తున్నారు.

 

పిరమిడ్స్ తయారుచేస్తున్నప్పుడు రాత్రి కలలో ఎంతో మంది ఇతర గ్రహాల మాస్టర్స్ మరి ఇతర గ్రహాల నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చేవారు! పిరమిడ్ వర్క్ చేస్తూన్నంత సేపూ వారు నాతో పాటు ఉండేవారు! నేను పిరమిడ్ గూర్చి ఎక్కడికైనా వెళితే అక్కడ నాకు ముందే పిరమిడ్ కనిపించేది! అలా ఎన్నో దేవాలయాలలో మరి శక్తి పిరమిడ్, అత్యధిక ధ్యానశక్తి పిరమిడ్‌లు నిర్మిస్తున్నాము. "పిరమిడ్ జగత్"కు ఇంతటి గొప్ప సేవ చేసే అవకాశాన్ని మా కుటుంబానికి కల్పించిన బ్రహ్మర్షి పత్రీజీకి శతకోటి ఆత్మప్రణామాలు!

 


రమేష్

చంద్రగిరి

చిత్తూరు జిల్లా - ఆంధ్రప్రదేశ్

+ 91 99498 04188

Go to top