" పత్రీజీ సాంగత్యంలో నా జీవితం అద్భుతంగా మలచబడింది "

 

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ద్వారా బ్రహ్మర్షి పత్రీజీ నిర్వహిస్తున్న ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన ఉద్యమంలో అంకితభావంతో పనిచేస్తూ తమ తమ జీవితాలను ధన్యం చేసుకుంటూన్న వారిలో కృష్ణాజిల్లా "గుడివాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" అధ్యక్షురాలు "ధ్యానరత్న గుండపనేని రాజకుమారి గారు" అతి ముఖ్యులు. ధ్యానంలోకి రాకమునుపు కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ "అతి మామూలు గృహిణి"లా జీవితం గడుపుతూన్న ఈ అమాయకురాలు ధ్యానం గురించి తెలుసుకుని తమ ధ్యానశక్తితో విశ్వకల్యాణ కారకమైన "శ్రీ రమణమహర్షి పిరమిడ్ శక్తిక్షేత్రం" నిర్మాణంలో పాల్గొని స్త్రీశక్తి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేశారు. అడుగడుగునా ఒక ఆత్మజ్ఞానిలా ధన్య జీవితాన్ని గడుపుతూన్న రాజకుమారి గారి ధ్యానానుభూతులు వారి మాటల్లోనే ..


ఎడిటర్

 

నా పేరు "రాజకుమారి". నేను కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణానికి చెందిన వేమూరి వెంకటేశ్వరరావు, లక్ష్మీబాయి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలలో రెండవ సంతానంగా .. ఒక బుద్ధునిలా .. పుట్టుకతోనే మధ్యేమర్గం అనుసరిస్తూ జన్మించాను. "స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి" అన్న పట్టుదలతో మా అమ్మ మా ముగ్గురికీ కాలేజీ చదువులు చెప్పించింది.

 

కాకినాడలో పాల్‌టెక్నిక్ కోర్సు పూర్తిచేసి హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ నా సహోద్యోగి సాంబశివరావు గారిని 1979 వ సంవత్సరంలో నేను వివాహం చేసుకున్నాను.

 

మాకు ఇద్దరు పిల్లలు పుట్టాక ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉండడంతో కొంతకాలం పాటు కర్నాటక రాష్ట్రంలో ప్రత్తి వ్యవసాయం చేసి ఆర్థికంగా కొంత స్థిరపడి మళ్ళీ పిల్లల చదువుల కోసం గుడివాడకు చేరుకున్నాం. గుడివాడ పాలిటెక్నిక్ కాలేజీలో "స్టెనో టైపిస్ట్"గా చేరడం .. మరి అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేస్తూన్న "స్వతంత్రకుమారి"గారితో పరిచయం కావడం నాలో క్రొత్త ఉత్సాహానికి తెరతీసింది.

 

ఇద్దరం కలిసి షిరిడీ బాబాకు పూజలు, భజనలు పారాయణలు చేస్తూ .. మహిళా సంఘాలతో కూడి పనిచేస్తూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళం.

 

ఈ క్రమంలో మాకు 1998 జూలై 11 వ తేదీన విజయవాడ పిరమిడ్ మాస్టర్స్ "జక్కారాఘవరావు"గారు మరి "కోనేరు వరలక్ష్మి మేడమ్"గార్లతో తొలి ధ్యాన పరిచయం జరిగింది.

 

సెప్టెంబర్ 20వ తేదీన పత్రీజీ గుడివాడలో తొలిసారి 200మందితో ధ్యానతరగతిని నిర్వహించి .. "ధ్యానజ్యోతి" ద్వైమాసిక పత్రికను విడుదల చేశారు.

 

వేదికపై పత్రీజీ ఫ్లూట్ వాయిస్తూ ధ్యానం చేయిస్తూంటే వేదిక క్రింద కుర్చీలో కూర్చున్న నేను నా కడుపులోని ప్రేగులన్నీ కదిలి కదిలి ఆనందంతో నాట్యం చేస్తూ ఢమరుకం మ్రోగిస్తూన్న అద్భుతమైన అనుభూతిని పొందాను! ధ్యానం తరువాత సార్ ఒక్కొక్కరినీ తమ అనుభవం చెప్పమంటే నేను నా అనుభవం చెప్పి .. "అది నా భ్రమేమో" అని కూడా చెప్పాను.

 

పత్రిసార్ గట్టిగా .. "భ్రమ కాదు .. నిజమే" అన్నారు. ఆ అద్భుత స్థితి ఏమిటో అప్పుడు నాకు అర్థం కాకపోయినా .. అనేక జన్మలు కలిసి ఉన్న ఆ దేవదేవుని గుర్తించిన ఆనందంతో నా ఆత్మ నాట్యం చేసిందని నాకు జ్ఞానపరంగా ఎదుగుతూన్న కొద్ది అర్థమైంది.

 

108సార్లు బాబా చరిత్ర, గురు చరిత్ర పారాయణ చేసిన తరువాత ఎన్నో అనుభవాలు, దివ్యదర్శనాలు పొందిన అనంతరం ఈ జన్మకు నాకు దొరికిన గొప్ప వరం పత్రీజీ. వారి సాంగత్యంలో నా జీవితం అద్భుతంగా మలచబడింది! అంతవరకూ "ఇంట్లో పని, ఆఫీసులో ఉద్యోగం మాత్రమే జీవితం" అనుకుని బ్రతికేస్తూన్న నేను అందరూ దివ్యాత్మస్వరూపాలే" అని .. "అందరూ ఒకానొక గొప్ప లక్ష్యంతోనే ఈ భూమి మీదకు వస్తారు" అనీ తెలుసుకున్నాను. "లక్ష్యం దిశగా సాగే ప్రయాణంలో ఎదురయ్యే పరిస్థితులలో మనం అనుసరించే విధివిధానాల ద్వారా పొందే అనుభవాల వల్లే మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది" కనుక జరిగే ప్రతి సంఘటనలోని కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇది నా వివాహం విషయంలోనే నాకు ఋజువైంది.

 

1979లో నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా సహోద్యోగి సాంబశివరావు గారు నాతో ఒకరోజు "నిన్ను నేను పెళ్ళి చేసుకుని సాధిస్తాను చూడు" అన్నారు. అన్నట్లుగానే మూడు నెలల్లో నన్ను పెళ్ళి చేసుకుని .. ఇరవై సంవత్సరాలు పాటు నన్ను సాధించారు. నేనేం మాట్లాడినా కోపం తెచ్చుకునేవారు.

 

"కావాలని కోరి పెళ్ళి చేసుకున్నారు, కొంచెం ప్రేమగా ఉండవచ్చు కదా" .. అంటే "ప్రేమా లేదు .. దోమా లేదు .. నిన్ను సాధించడానికే పెళ్ళి చేసుకున్నాను" అని కసిరేవారు. వారి మాటలు అర్థంకాక అయోమయంతో తెగ బాధపడేదాన్ని.

 

మొదటిసారి పత్రీజీతో కలిసి మానససరోవర యాత్రకు వెళ్ళి వచ్చిన మా వారు ఒక రోజు నేను కాలేజీ నుంచి రాగానే నాతో .. "నీవీ, నావీ కలిసి ఇంత వరకు ఇరవై జన్మలు గడిచాయి! ఇన్ని జన్మలలో మనం ప్రోగేసుకున్న పరస్పర శతృత్వం అంతా కూడా ఈ జన్మలో తీర్చుకుని మోక్షం పొందడం కోసమే మనం మళ్ళీ కలిసి జన్మ తీసుకుని పెళ్ళిచేసుకున్నాం!!" అని చెప్పారు.

 

గత జన్మల తాలూకు శరీరాలను వదిలివేసినా అప్పటి అనుభూతుల తాలూకు స్పందనా తరంగాలు మన నాడీమండలంలో వ్యాపించి ఉండి వాటి ప్రకంపనలు ఈ జన్మలో మన మానసిక తలాన్ని తాకినప్పుడు దానికి అనుగుణంగా మనం స్పందిస్తూ ఉంటాం.

 

ధ్యానపరంగా .. మరి జ్ఞానపరంగా .. మనం మన అంతర్గత శక్తిని ఎంతగా పెంచుకుంటూ ఉంటే గత జన్మల తాలూకు ప్రకంపనల నుంచి మనం అంతగా విముక్తి చెందుతూ ఉంటామని స్పష్టత పొందాక నాలో ఉన్న అయోమయం అంతా తొలగిపోయింది. అప్పటి నుంచి ఇద్దరం ఆనందంగా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించాము! ఈ క్రమంలో హైదరాబాద్ అమీర్‌పేటలో మా అమ్మాయి ‘లక్ష్మి’కి ఉద్యోగం వచ్చింది పత్రీజీ ఆశీస్సుల కోసం వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు .. "అప్పుడప్పుడూ ఇంటికి వస్తూండు. ఏదయినా విషయం ఉంటే నాకు చెప్పు. మీ అమ్మ పిచ్చిది, ఆమెకు ఏమీ తెలియదు" అన్నారు.

 

చిన్నప్పటినుంచీ మా అమ్మా, నాన్న, మావారు అందరూ నన్ను "నువ్వు పిచ్చిదానివి; నీకేమీ తెలియదు" అనేవారు చివరికి పత్రీజీ కూడా నన్ను "పిచ్చిది" అనేసరికి ఇక నాకు దుఃఖం ఆగలేదు. అయినా తమాయించుకుని ఇంటికి తిరిగి వచ్చాక "మరి ఇంత పిచ్చిదానిని ఈ జన్మను ఎన్నుకుని మరీ భూమిపైకి ఎందుకు వచ్చాను?" అని రకరకాలుగా ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుండిపోయాను.

 

కొద్దిసేపటికి సర్దుకుని ప్రక్కనే షెల్ఫ్‌లోఉన్న "జీసెస్" అనే పుస్తకం తీసి చూడగానే "వెర్రితనమే దివ్యత్వం; ఈ భూమిపై భగవంతుని కార్యం నిర్వహించబడటానికి అమాయకులను ఎంపిక చేసుకుంటారు" అన్న వాక్యం కనబడింది.

 

"పిచ్చిది" అన్న పత్రీజీ వాక్యంలో ఎంత అద్భుతమైన వివరణ దాగి ఉందో తెలుసుకున్నాక ఇక నా దుఃఖం పటాపంచలై .. ఏదో గొప్ప కార్యం వారు నాకు అప్పగించబోతున్నారని నేను తెలుసుకున్నాను! ఆ తరువాత త్వరలోనే వారు స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా .. గుడివాడ పట్టణానికే తలమానికంగా నిర్మించి తలపెట్టిన విశ్వకల్యాణ కట్టడం "శ్రీరమణ మహర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం" నిర్మాణ బాధ్యతలను నాకు అప్పజెప్పారు!

 

అంతకు మునుపు మేం ధ్యానంలోకి వచ్చిన క్రొత్తల్లో ఒక పిరమిడ్ మాస్టర్ వితరణ చేసిన 250 గజాల స్థలంలో చిన్న పిరమిడ్‌ను నిర్మించడానికి పత్రీజీ అనుమతి అడుగగా వారు "గుడివాడ పట్టణంలో పెద్ద పిరమిడ్ రావాలి; అందుకు ఒక ఎకరం స్థలం కావాలి మేడమ్" అన్నారు.

 

వెంటనే మా వారు స్థలం కోసం ప్రయత్నం చేయగా అప్పట్లో అది ఫలించలేదు. ఇప్పుడు 2010 సంవత్సరంలో శ్రీ నిమ్మగడ్డ నాగేంద్ర ఋషీకేశవరావు గారు శ్రీమతి నిమ్మగడ్డ బేబీ సరోజిని దంపతులు ఒక ఎకరం యాభై సెంట్ల భూమిని పిరమిడ్ నిర్మాణం కోసం మరి వారి సోదరి అడుసుమల్లి బేబీ సరోజిని, రామమోహనరావు దంపతులు 28 సెంట్లు భూమిని పిరమిడ్ క్షేత్రానికి దారి కొరకు విరాళంగా ఇచ్చారు.

 

12 జూన్ 2010 అమవాస్య రోజు పత్రీజీ విచ్చేసి పిరమిడ్‌కు శంఖుస్థాపన చేసి దానికి "శ్రీ రమణ మహర్షి పిరమిడ్ శక్తి క్షేత్రం"అని నామకరణ చేయడం జరిగింది.

 

గుంటూరు జిల్లా పిరమిడ్ మాస్టర్ శ్రీవెలగపూడి లక్ష్మణరావు గారి భూరి వితరణకు తోడు అనేక మంది దాతల సహాయసహకారాలతో ఇంజనీయర్లు ఈశ్వరరావు మరి పరశురాములు గార్ల పర్యవేక్షణలో నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి.

 

ఒక సంవత్సరం కాలం అంతా కూడా మట్టితోలి స్థలాన్ని చదును చేసి, రోడ్డువేయడం, బోర్, కరెంట్ ఏర్పాటు చేయడంతో పాటు ఉండడానికి రెండు R.C.C.రూములు కట్టడం జరిగింది! అందరూ "పిరమిడ్ అన్నదే మొదలుపెట్టకుండా ఉన్న డబ్బంతా ఈ పనులకు ఖర్చుపెడుతున్నారేమిటి?" అనడంతో "ఏమైనా తప్పు చేస్తున్నామా?" అనిపించింది. ధ్యానంలో కూర్చుంటే "ఈ శక్తిక్షేత్రంలో ఒక యోగి ఎప్పటినుంచో తపస్సు చేస్తున్నారు; దీపావళికి ఆయన తపస్సు పూర్తయి, అప్పుడు పిరమిడ్ నిర్మాణం మొదలవుతుంది" అన్న సందేశం వచ్చింది.

 

ఆ తరువాత అనుకున్నట్లుగానే దీపావళికి పిరమిడ్ నిర్మాణం మొదలయి .. అవసరానికి అనుగుణంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా డబ్బులు సమకూరుతూ సర్వహంగులతో కూడిన "కింగ్స్ ఛేంబర్" .. "క్వీన్స్ ఛేంబర్" లతో 60'x60' ధ్యాన పిరమిడ్ నిర్మాణం పూర్తయ్యింది!

 

2013 సంవత్సరం నవంబర్ 28 వ తేదీన దేవదేవులు బ్రహ్మర్షి పత్రీజీ మరి మేడమ్ స్వర్ణమాల పత్రి గార్ల చేతుల మీదుగా "శ్రీ రమణ మహర్షి పిరమిడ్ శక్తిక్షేత్రం" వేలాది మంది ధ్యానుల సమక్షంలో వైభవోపేతంగా ప్రారంభోత్సవం జరిపించుకుంది!

 

పిరమిడ్ నిర్మాణంలో పూర్తి సమయాన్ని కేటాయించడానికి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన నాకు కుటుంబపరంగా ఏనాడూ ఏవిధమైన ఇబ్బంది కలుగలేదు. మా పిల్లలు చక్కగా చదువుకుని తమ తమ జీవితాల్లో స్థిరపడ్డారు. నాతో పాటు ఈ శక్తిక్షేత్రం నిర్మాణంలో మనసా వాచా కర్మణా పాల్గొన్న పిరమిడ్ ధ్యాన మహిళలు శ్రీదేవి, నీలిమ, మాధవి, లక్ష్మి, మచిలీపట్నం లక్ష్మి, లక్ష్మీ సుందరి బృందం సేవలు మరువలేనివి.

 

గుడివాడ హైదరాబాద్ పట్టణాలకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉదయభాస్కర్ గారు కరెంట్ పనులన్నీ తమ స్వంత ఖర్చుతో దగ్గర ఉండి మరీ పూర్తిచేయించగా, విజయవాడ "ఓం ఆర్ట్ ప్రింట్స్" అధినేత "శ్రీ బెల్లంకొండ ముఖర్జీ" దంపతులు 23కేజీల క్రిస్టల్ బాల్‌ను బహుమతిగా పిరమిడ్‌లో అమర్చారు!

 

ఇలా అనేక అద్భుతమైన అనుభవాలతో నాచే ఇంత గొప్ప విశ్వకల్యాణ కార్యక్రమం చేయించిన నా తల్లి, తండ్రి, గురువు, దైవం పత్రీజీకి ఆత్మపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

 

ఈ శక్తిక్షేత్రంలో పౌర్ణమి, అమావాస్యధ్యానాలు, సేత్ వర్క్‌షాపులు, మౌనధ్యానాలతో పాటు గుడివాడ పట్టణంలో నిరంతర ధ్యాన కార్యక్రమాలు మరి శాకాహార ర్యాలీలు నిర్వహించబడుతున్నాయి.

 

 

 

గుండపనేని రాజకుమారి 

గుడివాడ

కృష్ణాజిల్లా

ఆంధ్రప్రదేశ్

 

Go to top